ఒక కంపెనీ ఎదగాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. ఆ సంస్థ అభివృద్ధి కోసం కష్టపడే ఉద్యోగులు, వారి అంకితభావం కూడా చాలా ముఖ్యం. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారికి తగిన గౌరవం ఇచ్చినప్పుడే.. ఆ సంస్థ మరింత బలంగా ఎదుగుతుంది. ఇప్పుడు సిలై సంస్థ కూడా ఇదే విషయాన్ని తన చర్యల ద్వారా చూపించింది.
సిలై సంస్థ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయేలా, ఆ సంస్థకు ఎంతో కీలకంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు సరికొత్త కార్లను బహుమతిగా అందించారు. సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ నలుగురి కృషిని గుర్తిస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు కార్లు అందించడమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఒక ఉద్యోగి విజయం వెనుక అతని కష్టం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం కూడా ఉంటాయి. అందుకే వారి కుటుంబాల సమక్షంలో ఈ బహుమతులను అందించడం ద్వారా సంస్థ వారి కృషికి మరింత విలువ ఇచ్చినట్లయింది.
నిజానికి కంపెనీలు తమ ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు.. ఉత్తమ పనితీరును కనపరిచిన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాయి. ఇప్పుడు సిలై కూడా ఇదే బాటలో అడుగులు వేసింది.
