స్వతంత్ర భారత చరిత్రలో 80 ఏళ్ల ప్రస్థానం ఒకెత్తయితే.. గత పుష్కర కాలంగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలన మరొకెత్తు. ఎన్నో దశాబ్దాలుగా నత్తనడకన సాగిన భారతదేశ ఆర్థిక గమనాన్ని, నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అగ్రరాజ్యాలు సైతం గౌరవించే స్థాయికి చేర్చారు ప్రధాని మోదీ. గతంలో ఏ పాలకుడూ చేయలేకపోయిన అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. మునుపెన్నడూ లేని ముందుచూపుతో దేశ ముఖచిత్రాన్ని మార్చేశారు.
కానీ, దేశాన్ని ఇంతటి ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానికి.. కేవలం సరిహద్దుల్లోని శత్రువులతోనే కాదు, దేశ ప్రగతిని సహించలేని అంతర్గత శక్తులతోనూ నిత్యం యుద్ధం చేయాల్సి వస్తోంది. గతంలో పాలకులు నినాదాలకే పరిమితమైతే.. మోదీ మాత్రం నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో మరెవరూ ఆలోచించని విధంగా పేదరిక నిర్మూలనకు పటిష్టమైన పునాది వేశారు.
అందులో ఒకటి.. జన్ ధన్-ఆధార్-మొబైల్. ఇదో త్రిమూర్తి వ్యవస్థ. కోట్లాది మంది పేదలకు బ్యాంక్ ఖాతాలు తెరిపించి, ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసి అవినీతిని అంతమొందించారు. ఆయుష్మాన్ భారత్.. దేశంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తూ.. వైద్యం భారం కాకుండా చూశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి & ఉజ్వల యోజన. రైతులకు పెట్టుబడి సాయం, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి గ్రామీణ భారతంలో వెలుగులు నింపారు. డిజిటల్ ఇండియా.. నేడు మారుమూల పల్లెల్లో సైతం రూపాయి చెల్లింపు కూడా డిజిటల్‌గా మారుతోందంటే.. అది మోదీ తెచ్చిన టెక్నాలజీ విప్లవమే. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో.. దేశంలో నిరుపేదలకు, నిరాశ్రయులకు కోట్ల సంఖ్యలో పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చి, సొంతింటి కల నిజం చేశారు. జల్ జీవన్ మిషన్ స్కీమ్‌తో “హర్ ఘర్ జల్” నినాదంతో కోట్లాది గ్రామీణ గృహాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చి, మహిళల దశాబ్దాల నీటి కష్టాలను తీర్చారు. గతి శక్తి & మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో దేశంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తూ, రక్షణ రంగంలో భారత్‌ను స్వయంసమృద్ధ దేశంగా మార్చారు. స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న వందే భారత్ రైళ్లు నేడు దేశ ప్రగతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గతంలో ఎవరూ చేయలేకపోయిన ఈ మార్పుల వెనుక ఉన్నది మోదీ దృఢ సంకల్పం, భవిష్యత్ భారత్ పై ఆయనకున్న ముందుచూపు.
ఒక చేత్తో ఆధునిక భారతదేశ ప్రగతి చక్రాలను వేగంగా పరుగెత్తిస్తూ.. మరోచేత్తో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సనాతన హిందూ ధర్మానికి పూర్వవైభవాన్ని తీసుకువస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో మరెవరూ చేయని విధంగా, అటు దేశ భౌతిక వికాసానికి.. ఇటు సాంస్కృతిక పునరుజ్జీవనానికి మోదీ రథసారథిగా నిలిచారు. ఓవైపు సంక్షేమ పథకాలతో పేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతూనే.. మరోవైపు హిందూ ధర్మ రక్షకుడిగా కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలలను సాకారం చేస్తున్నారు.
వందల ఏళ్ల నిరీక్షణకు, కోట్లాది మంది హిందువుల ఆరాధనకు ప్రతిరూపమైన అయోధ్య భవ్య రామమందిర నిర్మాణం సాకారమైందంటే.. అది ముమ్మాటికీ ప్రధాని మోదీ ధృఢ సంకల్పం వల్లే. దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ, రాజకీయ వివాదాల చుట్టూ నలిగిన రామాలయ కల మోదీ హయాంలోనే నిజమైంది. కేవలం అయోధ్యే కాదు.. కాశీ విశ్వనాథ్ ధామ్ పునర్నిర్మాణం, ఉజ్జయిని మహాకాల్ లోక్, కేదార్నాథ్ క్షేత్రాల ఆధునీకరణతో పాటు విదేశీ గడ్డపై.. ముఖ్యంగా అబుదాబిలో సైతం భవ్య హిందూ దేవాలయాన్ని నిర్మించి సనాతన ధర్మ కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తం చేశారు. హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను సగర్వంగా చాటిచెబుతూ ధర్మ రక్షకుడిగా మోదీ చరిత్రలో నిలిచిపోయారు.
ఇంతటి ఘనత వహించిన ప్రధానికి.. సొంత దేశంలోని ప్రతిపక్షాల నుంచి నిరంతరం అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేశంలో అభివృద్ధి జరుగుతున్నా.. సమాజంలో నిత్యం ఏదో ఒక రూపంలో చిచ్చు పెట్టాలని, అలజడులు రేపాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు తగ్గించేలా విపక్షాలు నడుచుకుంటున్నాయి. మరోవైపు.. ప్రధానిని, ఆయన తీసుకునే ప్రతి చారిత్రాత్మక నిర్ణయాన్ని గుడ్డిగా ద్వేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు. అవినీతిపై మోదీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుంటే.. ఆ నిర్ణయాలను అడ్డుకుంటూ రాజకీయ లబ్ధి కోసం దేశ రాజకీయాల్లో అస్థిరతను సృష్టించడానికి ఈ అంతర్గత శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి.
బయట ఉన్న శత్రు దేశాల సవాళ్లను తిప్పికొట్టడం ఒకెత్తయితే.. దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే అంతర్గత శక్తులను ఎదుర్కోవడం మరో ఎత్తు. వాటన్నింటినీ అధిగమిస్తూ, ఒత్తిళ్లకు లొంగకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నారు నరేంద్ర మోదీ. దేశాన్ని రక్షించడంలో, సరికొత్త శిఖరాలకు చేర్చడంలో ఆయన పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అదే నవభారతానికి అసలైన శ్రీరామరక్ష!







