ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే కేవలం కొన్ని కుటుంబాల జాగీరా? ఇక్కడ అధికారం అనేది ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి, ఆ కుటుంబాల వారసులకు బదిలీ అవ్వడమేనా? వైఎస్ రాజారెడ్డి పేరు చెప్పుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వైఎస్సార్ పేరును బ్రాండ్‌గా మార్చుకుని వైఎస్ జగన్ గద్దెనెక్కారు. అదే పేరు, అదే సెంటిమెంట్‌తో షర్మిల తెరపైకి వచ్చారు. ఇప్పుడు అదే వైఎస్సార్ వైభవాన్ని భుజాన వేసుకుని విజయసాయిరెడ్డి వస్తున్నారు.
అటు చూస్తే, నారా చంద్రబాబు నాయుడు నీడలో నారా లోకేష్ తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. మరి కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నాయకులకు చోటు లేదా? ప్రజాస్వామ్యం అంటే కుటుంబాల సామ్రాజ్య విస్తరణేనా?
ఏపీ యువతను చూస్తే గుండె రగులుతోంది. చదువుకున్న చదువులకు ఉద్యోగాలు లేవు, భవిష్యత్తుకు భరోసా లేదు. కానీ, ప్రతి ఎన్నికల్లోనూ ఏవో ఆశలు పెట్టుకుని, ఎవరో నాయకుడి వెనుక నిలబడి జెండాలు మోస్తూనే ఉన్నారు. తాతలు మోశారు, తండ్రులు మోశారు, ఇప్పుడు యువతరం కూడా అదే జెండాలను భుజాన వేసుకుని తిరుగుతోంది. నాయకుల కోసం గొంతు చించుకోవడం, సోషల్ మీడియాలో కొట్టుకోవడం, ఆ పార్టీ ఈ పార్టీ అంటూ గ్రూపులుగా విడిపోవడం… ఇదేనా యువతకు ఈ రాజకీయ వ్యవస్థ ఇస్తున్న బహుమతి? మీ భుజాలు పార్టీల జెండాలు మోసి కాయలు కాయడానికేనా? మీ రక్తమాంసాలు ఈ వంశ పారంపర్య రాజకీయాల ఎదుగుదలకు ఇంధనంగా మారాలా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు తీవ్రమైన రాజకీయ శూన్యతను, అసంతృప్తిని అనుభవిస్తున్నారు. ఈ మార్పులేని మొహాలు, ఈ కుల-కుటుంబ సమీకరణాల రాజకీయాలు చూసి జనం విసిగిపోయారు. ఒక కొత్త మార్పు కోసం, ఒక కొత్త ఆశ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది. ఈ వంశ రాజకీయాల కోటలను బద్దలు కొట్టే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంది. ప్రభుత్వాల వైఫల్యాలను, పాలకుల అరాచకాలను నిలదీసే ధైర్యం చదువుకున్న యువతలో ఉంది. కానీ ఆ శక్తి ఇంకా బయటకు రావడం లేదు.
ఇకనైనా జెండాలు మోసే బానిసత్వాన్ని యువత వదిలేయాలి. యువతరమే ఒక అజెండాతో రాజకీయ జెండాలుగా మారాలు. వారసత్వ రాజకీయాల వెన్నుముక విరవాలంటే యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. నాయకుల వెనుక నడిచే అనుచరులుగా కాదు, సమాజాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలి. వ్యవస్థను ప్రశ్నించే ప్రతి యువ గొంతుక ఒక విప్లవం కావాలి.
కుటుంబ రాజకీయాల బంధనాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తం చేయాల్సిన బాధ్యత నేటి యువతపైనే ఉంది. మార్పు కోసం ఎదురుచూడటం కాదు.. యువతే ఆ మార్పుగా మారాలి. ఆ యువతే తిరగబడాలి, గర్జించాలి, ఏపీ రాజకీయ ముఖచిత్రంపై కొత్త చరిత్రను లిఖించాల్సిందే.







