చెన్నై వేదికగా సాగుతున్న హైడ్రామా కేవలం ఒక సంస్థ ఊరేగింపునకు సంబంధించినది కాదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల మనుగడకు సంబంధించిన చారిత్రాత్మక పోరాటం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రూట్ మార్చ్లపై తమిళనాడు ప్రభుత్వం పదే పదే విధిస్తున్న ఆంక్షలపై మద్రాస్ హైకోర్టు సంధించిన నిలదీతలు, రాష్ట్రంలో పౌర హక్కుల అణచివేతకు పడుతున్న అద్దం.
“ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోనే శాంతియుతంగా ఊరేగింపులు సాగుతున్నప్పుడు, తమిళనాడులో ఎందుకు సాధ్యం కాదు?” అంటూ న్యాయస్థానం వేసిన సూటి ప్రశ్న ఓట్ల రాజకీయం కోసం వ్యవస్థలను వాడుకుంటున్న పాలకుల చెంపపెట్టు.
ఒక భావజాలంతో మనం ఏకీభవించాలా లేదా అనేది వ్యక్తిగత విచక్షణ, కానీ ఆ భావజాలాన్ని శాంతియుతంగా ప్రకటించే హక్కును కాలరాయడం నిరంకుశత్వం. శాంతిభద్రతల సాకుతో ఏటా అనుమతులను నిరాకరిస్తూ, ప్రతిసారీ పౌరులు కోర్టు మెట్లు ఎక్కేలా చేయడం పాలకుల అహంకారానికి పరాకాష్ట. పైగా ఇదిరాజ్యాంగ ఉల్లంఘన. ఆర్టికల్ 19(1)(b) ప్రకారం నిరాయుధంగా, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వమే, దాన్ని కాలరాసేందుకు కుట్రలు చేస్తోంది. ఇదొక ఐడియాలాజికల్ వివక్ష కూడా. తమకు నచ్చని సిద్ధాంతాలను గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకే గొడ్డలిపెట్టు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇది శాంతిభద్రతల వైఫల్యం సాకు కానే కాదు. ఊరేగింపులకు రక్షణ కల్పించాల్సింది పోయి, “మేము శాంతిభద్రతలను కాపాడలేం కాబట్టి ఆంక్షలు విధిస్తాం” అని చేతులెత్తేయడం ప్రభుత్వ అసమర్థతను చాటిచెబుతోంది.
ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కేవలం ఒక వర్గాన్ని లేదా ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సంతోష పెట్టడానికి రాజ్యాంగ విలువలనే పణంగా పెట్టడం అత్యంత ప్రమాదకరం. న్యాయస్థానాలు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా తీరు మార్చుకోకపోవడం చట్ట సభలపై, న్యాయవ్యవస్థపై ఉన్న అగౌరవాన్ని సూచిస్తోంది. శాంతియుత నిరసనలు, ఊరేగింపులు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటివి. వాటిని అణచివేయాలని చూస్తే ఆ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఏ భావజాలమైనా సరే, చట్ట పరిధిలో ఉన్నంతవరకు దాన్ని గౌరవించాల్సిందే. పాలకుల అణచివేత ధోరణి నశించాలి, రాజ్యాంగ బద్ధమైన పౌర హక్కులు వర్ధిల్లాలి. కోర్టు వ్యాఖ్యలైనా ఈ నిరంకుశ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.







