తెలంగాణ తెచ్చిన నాయకుడు, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన ప్రథమ ముఖ్యమంత్రి, కోట్ల మంది గుండెల్లో “తెలంగాణ బాపు”గా కొలువబడే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అటువంటి నేతపై, స్వయానా ఆయన కూతురు, రాజకీయ భిక్ష పొందిన కల్వకుంట్ల కవిత చేసిన “మరమనిషి” కామెంట్స్ తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరిచాయి. సొంత తండ్రిని, రాజకీయ గురువును ఇంతలా అవమానించడం వెనుక ఉన్న అసలు స్వార్థం ఏమిటి? ఈ రాజకీయ విస్ఫోటనం వెనుక దాగున్న శక్తులు ఎవరు?
కేసీఆర్ ఇచ్చిన రాజకీయ అండతో ఎంపీగా, ఎమ్మెల్సీగా చట్టసభల్లో చక్రం తిప్పిన కవితకు, ఇవాళ తండ్రిని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిది? తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగాలు చేస్తే, కేసీఆర్ కూతురిగా లభించిన పాపులారిటీతో “తెలంగాణ జాగృతి”ని నడిపిన ఆమె, ఇవాళ అదే ఉద్యమ నాయకుడి అస్థిత్వాన్ని ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. “మన మనిషి కాదు.. మరమనిషి” అంటూ సాక్షాత్తూ జన్మనిచ్చిన తండ్రినే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం, కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత, ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అనే కొత్త జెండాను, అజెండాను పట్టుకుని కవిత వీధుల్లోకి వచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం ‘టీఆర్ఎస్’ను ‘బీఆర్ఎస్’గా మార్చితే, ఆ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు అదే పాత పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజా క్షేమం కోసమే కొత్త ప్రయాణం అని చెప్తున్నప్పటికీ, దీని వెనుక కేవలం కుటుంబంలో పదవుల పంపకాలు, పొలిటికల్ ఇగోలు మాత్రమే ఉన్నాయనేది నగ్నసత్యం.
ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ప్రధానంగా చర్చకు వస్తోంది. లిక్కర్ కేసులో ఇరుక్కుని, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కవిత రాజకీయంగా పూర్తిగా ఒంటరయ్యారు. ఆ క్లిష్ట సమయంలో పార్టీ గానీ, కుటుంబం గానీ ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదనే అసంతృప్తి ఆమెలో గూడుకట్టుకుందనే ప్రచారం ఉంది. ఈ కేసుల వేడి నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి తండ్రిపైనే వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగారా? లిక్కర్ స్కామ్ తాలూకు రాజకీయ పరిణామాలు ఆమెను ఈ తీవ్ర నిర్ణయం వైపు నెట్టాయా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
గతంలో తెలంగాణను కుదిపేసిన ‘నోటుకు ఓటు’ కేసుల పరిణామాలు, ప్రస్తుత అధికార పీఠాల వ్యూహాలు కూడా కవిత కొత్త పార్టీ వెనుక ఉన్నాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ఓటు బ్యాంక్‌ను చీల్చడం ద్వారా లాభపడే రాజకీయ శక్తులే కవితను ముందుండి నడిపిస్తున్నాయా? “గుంట నక్కల చేతిలో కేసీఆర్ చిక్కుకున్నారు” అని కవిత అంటుంటే, అసలు కవితనే ప్రత్యర్థి పార్టీల వ్యూహాత్మక ట్రాప్‌లో పడిపోయారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నాయి.
తెలంగాణ సాధించిన జాతిపితను, ఒక అజేయ శక్తినే “మరమనిషి” అని అవమానించడం అంటే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఉద్యమ చరిత్రను తక్కువ చేయడమే. స్వార్థ రాజకీయాల కోసం కన్నతండ్రిని, పొలిటికల్ బాస్‌ను రోడ్డుకు ఈడ్చిన కూతురిని తెలంగాణ సమాజం ఏ మేరకు ఆదరిస్తుంది? కొత్త పార్టీ పేరుతో ఆమె వేసిన ఈ అడుగులు పొలిటికల్ మైలేజ్ ఇస్తాయా, లేక రాజకీయంగా ఆమెను మరింత దెబ్బతీస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.







