Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

బీజేపీ కోటకు బీటలు..

బీజేపీ కోటకు బీటలు..
Follow Us :
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని భూకంపం సంభవించింది. భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి కేవలం ఒక స్థానాన్ని కోల్పోవడం కాదు.. బీజేపీ సిద్ధాంతాలకే గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 
సాధారణంగా EVMలపై ఆరోపణలు చేసే విపక్షాలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన పోలింగ్‌లో స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల సొంత గడ్డపైనే కమలం పార్టీ పట్టు కోల్పోవడం అధిష్టానానికి పెద్ద షాక్. సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి, బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహలేపై ఘన విజయం సాధించి బీజేపీ సామ్రాజ్యానికి సవాల్ విసిరారు. 
నాగ్‌పూర్ అంటే బీజేపీకి ఒక అజేయమైన దుర్గం. అలాంటి చోట, ఆర్ఎస్ఎస్ పీఠం ఉన్న గడ్డపైనే ప్రతిపక్ష కాంగ్రెస్ జెండా ఎగురవేయడం బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపింది. సీఎం ఫడ్నవీస్ కౌంటింగ్ ముగియకముందే ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం, ఆ తర్వాత సీన్ రివర్స్ కావడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేయాల్సి రావడం బీజేపీ పడిన ముఖభంగానికి నిదర్శనం.
ఇంతకీ ఓటమికి దారితీసిన బలమైన కారణాలేంటి? అతివిశ్వాసమే దెబ్బ కొట్టిందా? సొంత గడ్డపై తిరుగులేదనే అతి నమ్మకమే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ కనెక్టివిటీ మిస్ అయిందా? క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలతో నేతల మధ్య గ్యాప్ రావడం, ప్రజా వ్యతిరేకతను పసిగట్టలేకపోవడం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. లేదా 
విపక్షాల వ్యూహాత్మక ఓటింగ్ పనిచేసిందా? పట్టభద్రులు, మేధావులు ఈసారి మార్పును కోరుకుంటూ కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపడం బీజేపీ కొంపముంచింది. 
ఈ ఓటమి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్ ఉన్న నాగ్‌పూర్‌లోనే పార్టీని కాపాడుకోలేకపోయిన బీజేపీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ శక్తులను ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. బ్యాలెట్ సమరంలో ఎదురైన ఈ పరాభవం, బీజేపీ నాయకత్వానికి శల్యపరీక్ష లాంటిదే.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →