కర్నూలు జిల్లాలో విద్యార్థుల భద్రతను గాలికొదిలేసిన ఒక ప్రైవేట్ విద్యాసంస్థ నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం బాధ్యతారాహిత్యం, పర్యవేక్షణా లోపం వల్ల ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని హాస్టల్ నుంచి అదృశ్యమైన ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. కూతురిని చూద్దామని కాలేజీకి వచ్చిన తల్లిదండ్రులకు యాజమాన్యం చెప్పిన సమాధానం విని గుండె పగిలినంత పనైంది. కూతురు కనిపించడం లేదనే చేదు నిజాన్ని కాలేజీ సిబ్బంది దాచడం, తల్లిదండ్రులు స్వయంగా వచ్చేంత వరకు ఈ విషయం వెలుగులోకి రాకపోవడం ప్రైవేట్ సంస్థల నిరంకుశత్వానికి, పాడుబడిన భద్రతా ప్రమాణాలకు అద్దం పడుతోంది. ఈ హృదయ విదారక ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు నేరుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. “ఇంకెన్ని చూడాలి లోకేష్ మేము? మా పిల్లల ప్రాణాలకు, భద్రతకు గ్యారెంటీ ఏది?” అంటూ మండిపడుతున్నారు.
లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, కార్పొరేట్ సదుపాయాలు కల్పిస్తున్నామని రంగుల ప్రపంచాన్ని చూపే ప్రైవేట్ కాలేజీల్లో కనీస భద్రత కరువైంది. ఒక ఆడపిల్ల హాస్టల్ గది నుండి బయటకు వెళ్తుంటే కంటి కనిపెట్టే నిఘా వ్యవస్థ లేదా? సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? వార్డెన్లు ఏం పర్యవేక్షిస్తున్నారు? విద్యార్థిని అదృశ్యమైతే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా దాచాల్సిన అవసరం కాలేజీ యాజమాన్యానికి ఏమొచ్చింది? తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఈ దాగుడుమూతలా? అంటూ విద్యార్థి సంఘాలు, బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, విద్యార్థుల భద్రతే మా ప్రాధాన్యత అని ప్రకటనలు గుప్పించే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల లాభాల కోసమే నిబంధనలను తుంగలో తొక్కుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ చదువుకునే వయసున్న ఆడపిల్లలు హాస్టళ్లలో సురక్షితంగా లేకపోతే, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల కోసం నగరాలకు ఎలా పంపించగలరు?
ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాలి. విద్యార్థిని భద్రతపై కాలేజీ యాజమాన్యం వహించిన క్రిమినల్ నిర్లక్ష్యంపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. కాలేజీ గుర్తింపును రద్దు చేసే దిశగా విద్యాశాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్టళ్లలో భద్రతా తనిఖీలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రభుత్వం ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని విద్యా రంగ నిపుణులు, మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.







