Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

అంకెల్లో వంద శాతం సక్సెస్… కానీ గ్రౌండ్‌లో శూన్యం!

అంకెల్లో వంద శాతం సక్సెస్… కానీ గ్రౌండ్‌లో శూన్యం!
Follow Us :
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్. మున్సిపల్ ఎన్నికల్లోనూ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్. బహుశా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావొచ్చు. ఇవన్నీ పేపర్ మీద, టీవీ స్క్రీన్ల మీద చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. కానీ, ఈ గెలుపుల వెనుక జనసేన ఒరిజినల్ క్యాడర్ శ్రమ ఉందా? లేక పక్క పార్టీల నుంచి వచ్చిన వలస పాలకుల అండ ఉందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
గెలిచిన సీట్లలో సగానికి పైగా నిన్నటిదాకా వేరే జెండాలు మోసి, ఎన్నికల ముందు కండువాలు మార్చిన నాయకులే. పార్టీ కోసం పదేళ్లుగా లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొని, రక్తం చిందించిన నమ్మకమైన జనసైనికుడు ఈ రోజుకీ కేవలం జెండాలు కట్టడానికే పరిమితమయ్యాడు. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి సీట్లు, పదవులు ఇస్తుంటే.. సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఊరు, పేరు లేని సామాన్య సైనికుడు ఎన్నాళ్లిలా త్యాగాలు చేయాలి? 
నాయకులు గెలిచింది జనసేన గుర్తు మీద కావొచ్చు, కానీ వారి రక్తం, రాజకీయం పక్క పార్టీలదే. రేప్పొద్దున ప్రయోజనాలు దెబ్బతింటే ఈ వలస నాయకులు సిద్ధాంతాలను తుంగలో తొక్కేసి పక్కాగా ప్లేట్ ఫిరాయిస్తారు. ఈ సైద్ధాంతిక వైరుధ్యాన్ని పవన్ కల్యాణ్ ఎలా ఎదుర్కొంటాడు?
రాజకీయాల్లో సర్దుబాట్లు, పొత్తులు అవసరమే కావచ్చు. కానీ సర్దుకుపోవడమే పరమావధిగా మారితే పార్టీ అస్తిత్వానికే ప్రమాదం. పవన్ కల్యాణ్‌కు యువతలో ఉన్న ఫాలోయింగ్ కనీవినీ ఎరుగనిది. ఆయన ఒక మాట చెబితే ప్రాణాలైనా ఇచ్చే యువత కోట్లలో ఉంది. అంతటి భారీ ప్రజా బలాన్ని ఓటు బ్యాంక్‌గా, ఒక బలమైన క్యాడర్‌గా మార్చడంలో నాయకత్వం ఘోరంగా విఫలమైందా అనే అనుమానం కలగక మానదు. గెలుపు కోసం ప్రతిసారీ పక్క పార్టీల వ్యూహాలపై, వలస నేతలపై ఆధారపడాల్సి వస్తే… జనసేనకు సొంత గ్రౌండ్ లెవెల్ బలం ఎక్కడుంది?
పొత్తుల ధర్మం పేరిటో, లేక వ్యూహాత్మక రాజకీయాల వల్లో… జనసేన కేవలం ఇతరులను గెలిపించే లేదా ఇతరుల సహాయంతో గెలిచే పార్టీగానే మిగిలిపోతుందా? ఇంకెన్నాళ్లు జనసైనికులు ‘జెండా కూలీలు’ అనే నిందను, ఆవేదనను మోయాలి? పవన్ కల్యాణ్ అగ్రెసివ్ పాలిటిక్స్‌ని చూసి, ఆయనే ఒక ప్రత్యామ్నాయ శక్తి అవుతాడని ఆశించిన ఏపీ యువతకు… ప్రస్తుత నెమ్మదైన, సర్దుబాటు ధోరణి తీవ్ర నిరాశను మిగులుస్తోంది.
దిక్కుతోచని స్థితిలో యువత… ఇప్పుడు కావాలి అసలైన సింహగర్జన!
ఒకప్పుడు వ్యవస్థను మార్చే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనిపించిన జనసేన, ఇప్పుడు కేవలం అధికార సమీకరణాల్లో ఒక భాగస్వామిగా మాత్రమే సరిపెట్టుకుంటోంది. యువతకు కేవలం ఎన్నికల గెలుపుల అంకెలు వద్దు… క్షేత్రస్థాయిలో జనసేన మార్క్ దూకుడు కావాలి. వలస నేతల నీడలో కాకుండా, సొంత సైనికుల బలంతో సింహంలా సింగిల్‌గా నిలబడే రోజు ఎప్పుడొస్తుందా అని క్యాడర్ ఎదురుచూస్తోంది. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా ఈ సర్దుబాట్ల రాజకీయాన్ని పక్కనబెట్టి… సొంత క్యాడర్‌ను లీడర్లుగా మార్చే అగ్రెసివ్ ప్లాన్‌తో గ్రౌండ్‌లోకి రాకపోతే, ఈ 100% స్ట్రైక్ రేట్లు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి!
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →