చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నిజంగానే సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఈ పిక్చర్ ఏం చెబుతోంది? ఏదో పొలిటికల్ ఈక్వేషన్ కనిపిస్తున్నట్టు లేదూ..! సౌత్ పాలిటిక్స్ ఒకే వేదిక పంచుకున్నట్టు లేదూ..! ఇందులో కనిపిస్తున్న కేటీఆర్, వైఎస్ జగన్, తమిళనాడు సీఎం విజయ్ జెన్జీలు కాకపోవచ్చు. కాని, ప్రస్తుతం వీళ్లే యూత్ ఐకాన్స్. తమ నాయకులుగా యువత కోరుకుంటున్నది వయసు అయిపోయిన వాళ్లను కాదు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, కర్నాటకలో డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య, తమిళనాడులో స్టాలిన్.. వీళ్ల వయసు అయిపోయింది. సో, ఇక పాలించేది వీళ్లే ఇదే అర్థం వచ్చేలా ఫొటోకు పోజ్ ఇచ్చారా వీళ్లు? సౌత్ పాలిటిక్స్‌ను కలిసి ఏలుదాం అనే సిగ్నల్స్ ఏమైనా ఇచ్చారా?
తమిళనాడులో సీఎం విజయ్.. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి, తమిళనాడులో సరికొత్త రాజకీయ శకానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్. ఇప్పటికే ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి, సుదీర్ఘ పాదయాత్రలతో యువతలో, ప్రజాబాహుళ్యంలో బలమైన మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలంగాణలో కేటీఆర్. విద్యావంతుడైన నాయకుడిగా, ఐటీ అండ్ ఆధునిక పారిశ్రామిక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా యువత, అర్బన్ ఓటర్లలో క్రేజ్ తెచ్చుకున్నారు.
సీనియర్ నాయకులైన కేసీఆర్, సీఎం చంద్రబాబు, సిద్ధరామయ్య, ఎంకే స్టాలిన్ వంటి వారు దశాబ్దాలుగా పాలిస్తూ వయసు రీత్యా తదుపరి తరానికి పగ్గాలు అప్పజెప్పాల్సిన తరుణంలో… భవిష్యత్తులో సౌత్ పాలిటిక్స్‌ను శాసించబోయే ప్రధాన శక్తులు తామే అనే సిగ్నల్ ఈ ఫొటో ద్వారా పంపించారా?
ఈ ముగ్గురు నేతలూ తమతమ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ అజెండాతో దూసుకుపోతున్న వారే. ప్రాంతీయ హక్కుల సాధనలో భవిష్యత్తులో సౌత్ సెంటిమెంట్ లేదా ప్రాంతీయ కూటమి అవసరమైతే, ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఒక బలమైన రాజకీయ వేదికగా మారే అవకాశం ఉంది.
ఈ ముగ్గురు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, ఒకే సమయంలో వేదికపైకి రావడం చూస్తే కేవలం ఇది కుటుంబ వేడుకకే పరిమితం కాకుండా, తెరవెనుక ఒకరికొకరు మద్దతుగా నిలుస్తామనే పరోక్ష సంకేతాలను కూడా ఇస్తున్నట్టు భావించవచ్చు.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఇటువంటి హై-ప్రొఫైల్ వివాహ వేడుకలు కేవలం మర్యాదపూర్వక కలయికలు మాత్రమే అయినప్పటికీ, రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికం కాదు. ఒకే ఫ్రేమ్‌లో ఈ ముగ్గురూ కలిసి ఇచ్చిన పోజ్, కచ్చితంగా “మేమంతా సౌత్ పాలిటిక్స్ భవిష్యత్ వారసులం” అని చెప్పకనే చెబుతున్నట్టుంది







