గడిచిన 12 ఏళ్ల కాలంలో భారతదేశం ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసి, ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. దౌత్యనీతి, అంతర్జాతీయ వాణిజ్యం, మానవతా దృక్పథం.. ఇలా ప్రతి రంగంలోనూ భారత్ సృష్టించిన రికార్డులు దేశ ప్రతిష్టను హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాల నిర్ణయాల కోసం ఎదురుచూసిన భారతదేశం, నేడు గ్లోబల్ లీడర్‌గా ఎదిగి ప్రపంచ ఎజెండాను నిర్దేశించే స్థాయికి చేరింది.
ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య బంధాలను బలోపేతం చేయడంలో భారత్ మునుపెన్నడూ లేని విధంగా అగ్రగామిగా నిలిచింది. అంతర్జాతీయంగా నమ్మకమైన ఆర్థిక వేదికగా మారడం వల్లే దేశంలోకి ఏకంగా 70 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వరదలా వచ్చి చేరాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలను కవర్ చేస్తూ 9 చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసింది. ముఖ్యంగా భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందం ద్వారా 100 శాతం సుంకాలు రద్దు కావడం, అలాగే భారత్-EU ఒప్పందంలో భాగంగా 99 శాతం వాణిజ్య రాయితీలను సాధించడం దేశ వాణిజ్య రంగానికి సరికొత్త జవసత్వాలను ఇచ్చింది. దీనికి తోడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్-GCC దేశాలతో వాణిజ్యం ఏకంగా 17 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం మోదీ ఆర్థిక దౌత్యానికి నిదర్శనం.
విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ అనుసరించిన వ్యూహాత్మక చొరవ వల్ల ప్రపంచ వేదికలపై భారతదేశం చెప్పిందే వేదంగా మారే స్థాయికి దౌత్యనీతి చేరుకుంది. అంతర్జాతీయంగా తీవ్ర భౌగోళిక విభేదాలు ఉన్నప్పటికీ, భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో 100 శాతం ఏకాభిప్రాయంతో ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్’ను ఆమోదింపజేసి భారత్ తన గ్లోబల్ లీడర్షిప్ సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రధాని మోదీ అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఇప్పటివరకు ప్రపంచ దేశాల నుంచి 33 అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలు దక్కాయి. దేశ వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రాయబార కార్యాలయాల సంఖ్యను 219 మిషన్లకు పెంచారు. ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన 39 ఎంబసీలు, కాన్సులేట్లు ఉన్నాయి. అలాగే భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు, గ్లోబల్ ఉపాధిని సులభతరం చేస్తూ 19 మైగ్రేషన్, మొబిలిటీ ఒప్పందాలు కూడా జరిగాయి.
కష్టకాలంలో ప్రపంచ దేశాలను ఆదుకుంటూనే, సంక్షోభంలో ఉన్న స్వదేశీయులను సురక్షితంగా రక్షించడంలో భారత్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కోవిడ్ మహమ్మారి సమయంలో మానవత్వమే పరమావధిగా ‘వ్యాక్సిన్ మైత్రి’ ద్వారా 100 కంటే ఎక్కువ దేశాలకు 30 కోట్లకు పైగా వ్యాక్సిన్లను భారత్ సరఫరా చేసింది. అలాగే 2020 నుంచి ఇప్పటివరకు తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న 15 కంటే ఎక్కువ దేశాలకు 85వేల టన్నులకు పైగా ఆహార ధాన్యాలను అందించి ఆదుకుంది.
ఈ అద్భుతమైన విజయాలు కేవలం అంకెలు కావు. బలమైన నాయకత్వంలో భారతదేశం సాధించిన ఆత్మవిశ్వాసానికి, సార్వభౌమాధికారానికి ప్రతీకలు. “విశ్వాస్ కే, వికాస్ కే, జన్-కల్యాణ్ కే” అనే మూలసూత్రంతో సాగిన ఈ 12 ఏళ్ల ప్రస్థానం, రాబోయే రోజుల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడం ఖాయమని స్పష్టం చేస్తోంది.







