Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

అర్నబ్ ఉగ్రరూపం.. కోస్తాంధ్ర అతలాకుతలం

అర్నబ్ ఉగ్రరూపం.. కోస్తాంధ్ర అతలాకుతలం
Follow Us :

బంగాళాఖాతంలో రేగిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను ఏపీ తీరాన్ని కకావికలం చేసింది. గంటకు 135 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసిన కుండపోత వర్షాలు కోస్తాంధ్రను శ్మశాన సదృశంగా మార్చాయి. నర్సాపురం, యానాం మధ్య అర్నబ్ భీకరంగా తీరం దాటుతుంటే, భద్రతా ఏర్పాట్లు చేసామని చెప్పుకున్న యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకృతి బీభత్సానికి ఇప్పటికే ఐదుగురు అమాయకులు బలికాగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించింది.

ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాలపై అర్నబ్ రాక్షసంగా విరుచుకుపడింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రచండ గాలుల ధాటికి వేలాది చెట్లు భీకరంగా విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. 25 లక్షలకు పైగా ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయి, అంధకారం రాజ్యమేలుతోంది. రోడ్లన్నీ జలమయమై అంతర్గత రవాణా పూర్తిగా కట్ అయిపోయింది. పశ్చిమ గోదావరి, కోనసీమ పరిధిలో కళ్ల ముందే ఇళ్లు, గుడిసెలు కూలిపోయి జనాల ఆక్రందనలు మిన్నంటాయి.

అర్నబ్ సృష్టించిన మహా ప్రళయానికి అన్నదాత నిలువునా మునిగిపోయాడు. చేతికొచ్చిన వరి, ఉద్యానవన పంటలు దాదాపు 80,000 హెక్టార్లలో నీటిపాలయ్యాయని ప్రాథమిక అంచనా. ప్రభుత్వం కేవలం రివ్యూ మీటింగులు, ఆన్-లైన్ లెక్కలకే పరిమితమైందని, పొలాల్లో నీరు తీసేందుకు, ముంపు నివారణకు సరైన గ్రౌండ్ లెవెల్ చర్యలు తీసుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తు వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ప్రజలను కాపాడటంలో ఘోరంగా విఫలమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ మోడల్స్, 36 వేల మొబైల్ టవర్ల నిఘా అంటూ భారీ బిల్డప్ ఇచ్చింది. కానీ, తీరా తుపాను తాకినప్పుడు కనీసం కరెంట్ పునరుద్ధరణ, రహదారుల క్లియరెన్స్ వంటి అత్యవసర పనులు కూడా సకాలంలో జరగలేదు. టెక్నాలజీపై ఉన్న శ్రద్ధ గ్రౌండ్ లెవెల్ ఏర్పాట్లపై లేదనేది స్పష్టమవుతోంది. తుపాను వస్తుందని వారం రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా, తీర ప్రాంత లోతట్టు గ్రామాల్లో ప్రజల తరలింపు ప్రక్రియలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. దాంతో అర్నబ్ తాకిడి మొదలయ్యాక జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరదల్లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. తుపాను ధాటికి కరెంట్ తీగలు తెగిపడి, గోడలు కూలి ప్రాణాలు కోల్పోయిన నిర్భాగ్యులకు ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంది. మానవ తప్పిదాలు, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలకు ఈ అరకొర పరిహారం ఏమాత్రం సరిపోదని బాధితుల కుటుంబాలు మండిపడుతున్నాయి.

ప్రతి చిన్న విషయానికీ తామే బాధ్యులమని చెప్పుకునే సర్కార్, నష్టం జరగ్గానే కేంద్రానికి లేఖలు రాయడం, అమిత్ షా సహాయం కోరడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర సొంత విపత్తు నిధులు ఏమయ్యాయని, ముందస్తు బడ్జెట్ కేటాయింపులు ఎటు వెళ్లాయనే నిలదీతలు వస్తున్నాయి.

అర్నబ్ తుపాను ప్రకృతి ప్రకోపమే కావచ్చు, కానీ వ్యవస్థల అసమర్థత వల్లే నష్టం తీవ్రత పెరిగిందనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా పేపర్ రివ్యూలు పక్కనబెట్టి, యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు అందించి, అంధకారంలో ఉన్న కోస్తాంధ్రకు వెలుగులు నింపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →