ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘ఆర్నబ్’ తుఫాన్ సృష్టించిన బీభత్సంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, ఆయన మారుస్తున్న మాటలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. విపత్తు వేళ బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు.. మరణాల లెక్కలపై పూటకో ప్రకటన చేస్తూ ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.
తుఫాన్ తీవ్రతపై “ఐదుగురు చనిపోయారు” అని మొదట ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉదయానికి ఆ సంఖ్యను “ఏడుగురు” గా మార్చారు. నిమిష నిమిషానికి మారుతున్న ఈ మరణాల లెక్కలు చూస్తుంటే అసలు ప్రభుత్వ దగ్గర సరైన సమాచారం ఉందా? లేక క్షేత్రస్థాయి నుంచి వచ్చే నివేదికలను తొక్కిపెడుతున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై కూడా ఇంతటి నిర్లక్ష్య సమాధానాలా అని బాధితులు మండిపడుతున్నారు.
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. NDRF ప్రాణనష్టంపై ముందే హెచ్చరించినా, సీఎం చంద్రబాబు మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి “రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ప్రాణం కూడా పోలేదు, సున్నా మరణాలు నమోదయ్యాయి” అని నివేదించారు.
ఇంతకీ చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి అలా ఎందుకు చెప్పారు? వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికా? ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే నింద పడకుండా ఉండేందుకే అమిత్ షాకు “జీరో క్యాజువాలిటీస్” అని అబద్ధపు రిపోర్ట్ ఇచ్చారా? కేంద్రానికి పంపిన నివేదికలో వేలాది హెక్టార్ల పంట నష్టం, ఆస్తి నష్టంపైనే చంద్రబాబు గురిపెట్టారు. మనుషుల ప్రాణాల కంటే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక ప్యాకేజీలు, నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఈ డ్రామా ఆడారా? ఆస్తి నష్టాన్ని కొండంత చూపిస్తూ, ప్రభుత్వ ప్రతిష్ట కోసం ప్రాణనష్టాన్ని దాచాలని చూశారా?
కేంద్రాన్ని తప్పుదోవ పట్టించడం నేరం కాదా? ఒకవైపు కేంద్ర సంస్థలైన NDRF బృందాలు క్షేత్రస్థాయిలో మరణాలను ధృవీకరిస్తుంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కేంద్ర హోంమంత్రికి తప్పుడు సమాచారం ఇవ్వడం దేశ రక్షణ, విపత్తు నిర్వహణ చట్టాల ప్రకారం తీవ్రమైన ఉల్లంఘన కాదా? నిన్న ఐదు, ఇవాళ ఏడు అని మారుస్తున్న మాటలను బట్టి చూస్తే.. కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన నివేదిక పూర్తిగా పచ్చి అబద్ధమని తేలిపోవడం లేదా?
తుఫాన్ ధాటికి సర్వస్వం కోల్పోయి పునరావాస కేంద్రాల్లో రోడ్డున పడ్డ ప్రజల కంటే పాలకులకు రాజకీయ ప్రతిష్టే ఎక్కువైందా? ఇప్పటికైనా ఈ మాటల మార్పిడికి స్వస్తి చెప్పి, కేంద్రానికి అసలైన వాస్తవాలు వివరించి, మరణించిన ఏడుగురి కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.







