Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

యువతా.. మీకు చోటెక్కడ?

యువతా.. మీకు చోటెక్కడ?
Follow Us :

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. గ్రామాల్లో సర్పంచులు, పట్టణాల్లో మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే స్థానిక నాయకులు. కానీ, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని చూస్తే ఒక భయంకరమైన నిజం స్పష్టమవుతోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు తమ కుటుంబ వ్యాపారాలుగా, వారసత్వ సామ్రాజ్యాలుగా మార్చేశాయి.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అనుచరులు, వాళ్ల బంధువులు, వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పదవుల్లో కూర్చోవాలా? కొత్తవాళ్లు, చదువుకున్న యువత, నిజాయితీ గల సామాన్యులు ఈ పదవులకు పనికిరారా?

స్థానిక ఎన్నికల వేళ రెండు ప్రధాన పార్టీలు వీధుల వెంట కొట్టుకు చావడం వెనుక ఉన్నది ప్రజా సేవ కాదు, కేవలం అధికార దాహం. స్థానిక సంస్థలకు వచ్చే కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు, కాంట్రాక్టులను తమ వాళ్లకే దక్కించుకోవాలనే స్వార్థం. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు చెదరకుండా చూసుకోవడానికి గ్రామ స్థాయి నుంచి తమ అనుచరులను ‘బోను’లో పెట్టి ఉంచడమే ఈ రెండు పార్టీల లక్ష్యం. “మా ఊళ్లో మా మాటే చెల్లాలి” అనే ఫ్యూడల్ ఆలోచనా విధానంతో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు.

కొత్తవాళ్లు, చదువుకున్నవాళ్లు, సామాన్య ప్రజలు మేయర్లుగా, మున్సిపల్ ఛైర్మన్లుగా, సర్పంచులుగా నిలబడితే ఈ రాజకీయ వ్యాపారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొత్త రక్తం వస్తే పాత తరం నాయకుల అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తారు. అది వీళ్లకు ఇష్టం లేదు. ఒక సామాన్యుడు గెలిచి చూపిస్తే, రేపు తమ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు ఎసరు వస్తుందేమోననే భయం పెద్ద నాయకులను వెంటాడుతోంది. అందుకే, కొత్త రక్తాన్ని ఈ రెండు పార్టీలు రానివ్వడం లేదు.

ఇంతకీ.. వేరే రాజకీయం రాకూడదా? కచ్చితంగా రావాలి! ప్రస్తుత విధానం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. నాయకుడి కొడుకు నాయకుడు, మంత్రి తమ్ముడు సర్పంచ్, ఎమ్మెల్యే అనుచరుడు మేయర్ అయితే.. ఇక సామాన్య ఓటరు కేవలం ఓటు వేసే మిషన్ మాత్రమేనా? వారసత్వ రాజకీయాల కోరల్లో చిక్కుకున్న స్థానిక సంస్థలను విడిపించాల్సిన సమయం వచ్చింది. మేధావులు, యువత, కొత్త ఆలోచనలు ఉన్నవాళ్లు సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, మేయర్లుగా అడుగుపెట్టాలి.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →