ఢిల్లీ పీఠంపై పుష్కరకాలంగా తిరుగులేని శక్తిగా వెలుగుతున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అసలైన సవాల్ ఎదురవుతోందా? 2014 నాటి ఆకలి, కసి, వ్యూహం.. నేటి అధికార పీఠంపై ఉన్న బీజేపీలో లోపించాయా? “మాకు ప్రత్యామ్నాయమే లేదు” అనే అతివిశ్వాసం ఆ పార్టీ కోటలకు బీటలు వారుస్తోందా? రాజకీయంగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ గాడి తప్పుతోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. సమయం ఇంకా మించిపోలేదు, కానీ ఇప్పుడే కళ్లు తెరవకపోతే 2029 సార్వత్రిక ఎన్నికల సమరంలో కమలనాథులకు కష్టాలు తప్పవనేది నగ్నసత్యం.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక స్పష్టమైన ప్రజా విప్లవం కనిపించింది. అప్పట్లో పార్టీలో అధికారం కోసం ఆరాటం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలతో అనుసంధానం బలంగా ఉండేవి. కానీ నేటి బీజేపీలో ఆ పరిస్థితి ఉందా అంటే అనుమానమే! పదేళ్ల అధికారం తెచ్చిన బద్ధకం, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ప్రజావ్యతిరేకత, అన్నింటికీ మించి “ప్రత్యామ్నాయం ఎవరున్నారు?” అనే అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చరిత్రలో ఎంతటి బలమైన సామ్రాజ్యాలైనా పతనమైంది శత్రువుల బలం వల్ల కాదు, తమ స్వయంకృతాపరాధాలు మరియు అతివిశ్వాసం వల్లే.
దేశంలో ఒక కొత్త తరం ఓటర్లు దూసుకొస్తున్నారు. 2014 నాటి రాజకీయ పరిణామాలతో సంబంధం లేని, కేవలం ప్రస్తుత ఉపాధి, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తును మాత్రమే ప్రామాణికంగా తీసుకునే కోట్ల మంది యువ ఓటర్లు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. పాత సెంటిమెంట్లు, భావోద్వేగ రాజకీయాలు ఈ యువ కెరటాల ముందు ఎంతో కాలం నిలవలేవు. యువత ఆకాంక్షలను గుర్తించడంలో, వారికి సరైన ఉపాధి మార్గాలు చూపడంలో విఫలమైతే.. ఈ ముంచుకొస్తున్న యువ కెరటాలు కమల దళాన్ని ముంచేయడం ఖాయం.
ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు, స్థానిక నాయకత్వాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడుతున్నాయి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే భ్రమలో, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చే ప్రయత్నం బీజేపీకి అత్యంత ప్రమాదకరం. వలస నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యతతో, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కరడుగట్టిన కార్యకర్తల్లో నైరాశ్యం పెరుగుతోంది. ఇదే జరిగితే ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల వద్ద పార్టీని నడిపించే నాథుడే కరువవుతాడు.
ఢిల్లీ కోటలు ఇంకా భద్రంగానే ఉన్నాయని భ్రమపడితే పొరపాటే. కోటలు కూలిపోవడానికి ఒక్క చిన్న బీట చాలు. 2029 ఎన్నికలు బీజేపీకి కేవలం మరో ఎన్నికల సమరం కాదు, అది ఆ పార్టీ మనుగడకు పరీక్ష. అధికారం తలకెక్కిన అహాన్ని పక్కనబెట్టి, ప్రత్యామ్నాయం లేదన్న భ్రమల నుంచి బయటకు వచ్చి, తక్షణమే పార్టీని రీ-బూట్ చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించి, ప్రజా నాడిని పట్టుకుని బీజేపీ కళ్లు తెరుస్తుందా? కాలమే నిర్ణయించాలి.







