Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

మహా వ్యూహకర్త మోదీ

మహా వ్యూహకర్త మోదీ
Follow Us :

ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన అత్యంత నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి మార్కో రూబియోను నేరుగా న్యూఢిల్లీకి కాకుండా, గుజరాత్‌లోని జామ్‌నగర్ చమురు శుద్ధి కర్మాగారానికి పంపించాల్సి వచ్చింది. ప్రపంచ రాజకీయాల గమనాన్ని మార్చేస్తూ, భారత్ వైపు అమెరికాను తిప్పుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన అసాధారణ దౌత్య విజయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మొన్నటిదాకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన అమెరికా, నేడు తానే స్వయంగా మోదీ ప్రభుత్వంతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంతర్జాతీయ ఇంధన రాజకీయాల వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. మొన్నామధ్య వెనెజులాలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు, మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వంటి పరిణామాల తర్వాత, అక్కడి ఆయిల్ రంగాన్ని అమెరికా తన పర్యవేక్షణలోకి తీసుకుంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు ఉన్న వెనెజులా వద్ద ఉన్నది అత్యంత బరువైన, జిగట, సల్ఫర్ ఎక్కువగా ఉండే ‘హెవీ క్రూడ్ ఆయిల్’. ఈ రకమైన చమురును నేరుగా వాడలేము. దీన్ని శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్‌గా మార్చడానికి అత్యాధునిక రిఫైనరీలు కావాలి. వెనెజులాలో దశాబ్దాలుగా ఉన్న సంక్షోభం వల్ల అక్కడి రిఫైనరీలు ధ్వంసమయ్యాయి. అక్కడ కొత్త మౌలిక వసతులు నిర్మించి, చమురును పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తేవడానికి కనీసం 20 నుండి 25 ఏళ్లు పడుతుందన్నది నిపుణుల అంచనా. పైగా అమెరికా వద్ద షేల్ ఆయిల్ పుష్కలంగా ఉన్నప్పటికీ, వారి సొంత రిఫైనరీలు వెనెజులా లాంటి హెవీ క్రూడ్‌ను భారీ స్థాయిలో శుద్ధి చేయడానికి సరిపోవు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆశాకిరణం – భారతదేశానికి చెందిన రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనరీ కావడం విశేషం. ప్రపంచంలో మరే దేశానికి లేని ఒక ప్రత్యేక సాంకేతిక సామర్థ్యం జామ్‌నగర్ రిఫైనరీకి ఉంది. ఎంతటి నాణ్యత లేని, అత్యంత బరువైన వెనెజులా క్రూడ్ ఆయిలనైనా చాలా సులభంగా శుద్ధి చేసి, నాణ్యమైన డీజిల్‌గా మార్చగల అద్భుతమైన సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతం అమెరికాలో డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి, ట్రంప్ ప్రభుత్వానికి అంతర్గతంగా రాజకీయ సెగ తగులుతోంది. దీంతో, వెనెజులా నుంచి వచ్చే ఆయిల్‌ను భారత్‌లో శుద్ధి చేయించి, అంతర్జాతీయ మార్కెట్లోకి సరఫరా చేయడమే ఏకైక మార్గమని ట్రంప్ గ్రహించారు. అందుకే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబై, జామ్‌నగర్‌లలో పర్యటించి, “భారత్ ఒక రిఫైనింగ్ సూపర్‌పవర్” అని బహిరంగంగా ప్రకటించారు. భారత్ మరిన్ని ఎక్కువ చమురు నిల్వలను శుద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు.

ఇప్పుడు గనుక భారత్-అమెరికా మధ్య చమురు మరియు వాణిజ్య ఒప్పందం ఖరారైతే, అది స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం అవుతుంది. గత 30, 40 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతంలో ఇంతకన్నా బిగ్గెస్ట్ జియో పొలిటికల్ డీల్ అనేది మరొకటి లేదు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నందుకు గానూ భారత్‌పై విధించాలనుకున్న భారీ టారిఫ్‌లను అమెరికా తన సెంటిమెంట్లు పక్కనబెట్టి వెనక్కి తీసుకునేలా మోదీ దౌత్యం పనిచేసింది. ఒకప్పుడు భారత్‌కు షరతులు విధించిన అమెరికా, నేడు తన సొంత ఇంధన అవసరాల కోసం, ధరలను అదుపులో ఉంచుకోవడం కోసం భారత్ సహాయాన్ని అర్ధించే స్థితికి చేరింది. దేశీయంగా జరుగుతున్న కొన్ని అల్లర్లు లేదా అంతర్జాతీయ శక్తుల కుట్రల వెనుక విదేశీ హస్తాలు ఉన్నాయనే ఆరోపణలు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతోంది. రష్యాతో ఉన్న కొన్ని దశాబ్దాల బలమైన స్నేహాన్ని కాపాడుకుంటూనే.. అటు అమెరికా సైతం భారత్ ముందు మోకరిల్లేలా చేయడం కేవలం నరేంద్ర మోదీ అసాధారణ నాయకత్వ పటిమ వల్లే సాధ్యమైంది. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను శాసించే “కింగ్ మేకర్” స్థానంలో ఈరోజు భారతదేశం నిలబడింది. ఈ బిగ్గెస్ట్ జియో-పొలిటికల్ డీల్ ద్వారా రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ సరికొత్త శకానికి నాంది పలకబోతోంది.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →