Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

పంజాబ్ పాలిటిక్స్‎లో పెను భూకంపం

పంజాబ్ పాలిటిక్స్‎లో పెను భూకంపం
Follow Us :
పంజాబ్‌ రాజకీయ రణరంగం ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందే, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పునాదులు కదిలిపోయేలా BJP అత్యంత దూకుడుగా మైండ్ గేమ్ షురూ చేసింది. మొన్నటికి మొన్న రాజ్యసభ ఎంపీల తిరుగుబాటుతో షాక్ తిన్న సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వానికి, ఇప్పుడు క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఊపిరాడకుండా చేస్తోంది. ఆప్ మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు గుడ్‎బై చెప్పి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, మాజీ మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా, సనూర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాల మహా చేరికలతో పంజాబ్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి.
ఢిల్లీ వేదికగా ఆప్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ త్రిమూర్తులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కాషాయ జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆప్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆప్‎లో తన ప్రస్థానాన్ని ఒక ఇంటర్న్‌షిప్ పీరియడ్‎గా అభివర్ణించిన కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, పంజాబ్ ఉనికిని కాపాడటానికే తాను బీజేపీలోకి వచ్చానని సింహగర్జన చేశారు. భగవంత్ మాన్, కేజ్రీవాల్ ఇద్దరూ కలిసి పంజాబ్‌లో ఆప్‎ను సర్వనాశనం చేశారని, ఇక అక్కడ ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ అని తేల్చిచెప్పారు. పంజాబ్ పవిత్ర భూమిని ఆప్ ప్రభుత్వం నరకంగా మార్చేసిందని, గ్యాంగ్‌స్టర్ల రాజ్యం, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్ బతకాలంటే మోదీ నాయకత్వంలోని ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఒక్కటే శరణ్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఢిల్లీ నేతల పెత్తనం, విచ్చలవిడి అవినీతిని భరించలేకే బయటకు వచ్చామంటూ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్, పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే సత్తా కేవలం అమిత్ షా, బీజేపీకి మాత్రమే ఉందని ప్రకటించారు.
ఈ చేరికలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట సిట్టింగ్ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగరేయడం మాన్ సర్కార్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఆప్ అంతర్గత అసంతృప్తిని, టికెట్ల కేటాయింపుల గందరగోళాన్ని బీజేపీ పూర్తిగా క్యాష్ చేసుకుంటోంది. ఈ రాజకీయ యుద్ధంపై సీఎం భగవంత్ మాన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, దమ్ముంటే నన్ను కొనుగోలు చేయాలంటూ బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పార్టీని వీడిన వారిని ‘ద్రోహులు’గా అభివర్ణిస్తూ, వారు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏది ఏమైనా, పంజాబ్ సరిహద్దుల్లో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒకవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్, మరోవైపు పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కరడుగట్టిన వ్యూహాలతో దూసుకుపోతున్న బీజేపీతో ప్రస్తుతానికి పంజాబ్ పాలిటిక్స్ అగ్రేసివ్ క్లైమాక్స్ వైపు పరుగులు తీస్తున్నాయి.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →