Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

 వైఎస్సార్‌సీపీలో చేరిన గుండా లక్ష్మీదేవి

 వైఎస్సార్‌సీపీలో చేరిన గుండా లక్ష్మీదేవి
Follow Us :

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీతో తమ కుటుంబానికి దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉందని లక్ష్మీదేవి తెలిపారు. అయితే, గతంలో పార్టీలో ఉన్న విలువలు, సిద్ధాంతాలు ప్రస్తుతం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. తన భర్త, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. విలువలకు ప్రాధాన్యత లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే టీడీపీని వీడినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆమె విమర్శించారు. రైతులకు అవసరమైన సహాయం అందడం లేదని, ఆసుపత్రుల్లో మందుల కొరత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం పలు రంగాల్లో వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు.

అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. గుండా లక్ష్మీదేవి 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందారు. ఆమెతో పాటు పలువురు టీడీపీ నాయకులు, అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →