దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగానే విమర్శలకు కారణమవుతున్నాయి. ‘నేను దెందులూరు నుండి పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని చింతమనేని చెప్పారు.. ఆయనతో గొడవపడడం అంటే నాకు ఇష్టం. కోపంలోనే ఇష్టం ఉంటుంది.. కోపం ఉన్నచోటే ప్రేమ ఉంటుంది” అంటూ పవన్ కల్యాణ్ వలకబోసిన ‘రాజకీయ తత్వశాస్త్రం’ విమర్శకులకు ఆయుధంగా మారింది.
గత ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించామని, రికార్డు సృష్టించామని కాలర్ ఎగరేసిన జనసేనాని.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఇంకా టీడీపీ నేతల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడటం ఎంతవరకు సమంజసం? సొంతంగా నిలబడే సత్తా లేదా? కోట్లాది మంది అభిమానులు, బలమైన సామాజిక వర్గం, అండగా నిలిచే యువత ఉన్నా.. పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు మార్క్ రాజకీయం, టీడీపీ లీడర్ల సపోర్ట్ లేకపోతే గెలవలేరా అనే అనుమానాలు ఈ కామెంట్స్ ద్వారా ఆయనే స్వయంగా కల్పించుకుంటున్నారు. ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం, ల్యాండ్ గ్రాబింగ్ అంటూ ఎవరినైతే పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారో.. ఈరోజు అదే నాయకులతో “కోపంలోనే ప్రేమ ఉంటుంది” అని సరిపెట్టుకోవడం జనసైనికులకే మింగుడుపడటం లేదు.
ఇది పవన్ కల్యాణ్ స్థాయికి తగునా? సొంతంగా పార్టీ పెట్టి, దశాబ్ద కాలంగా రాజకీయాల్లో నలిగి, అధికారం సాధించిన తర్వాత కూడా ఒక ప్రాంతీయ స్థాయి, వివాదాస్పద టీడీపీ నేతను అంతలా నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కల్యాణ్‌కు ఏమొచ్చింది? నువ్వు సింగిల్‌గా గెలిచే సత్తా నీకు లేదా జనసేన ఓటు బ్యాంకును నమ్ముకోకుండా.. ఇంకా తమ్ముళ్ల అండ కోసమే ఆరాటపడాలా?
రాజకీయంలో వ్యూహాలు ముఖ్యం కాదనలేం. కానీ అది సొంత అస్తిత్వాన్ని, పార్టీ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఉండకూడదు. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టిన నాయకుడు.. ‘సింహం సింగిల్‌గా వస్తుంది’ అనే రేంజ్లో ఉండాలి కానీ, పక్క పార్టీ నేతల ప్రేమ కోసమో, సపోర్ట్ కోసమో వెంపర్లాడేలా మాట్లాడటం స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది. ఇప్పటికైనా సొంత కాళ్లపై పూర్తిస్థాయిలో నిలబడటంపై దృష్టి పెట్టండి.. కూటమి ధర్మం పేరుతో తమ్ముళ్లను భుజాన మోయడం ఆపండి.







