ప్రస్తుత అస్థిరమైన జాబ్ మార్కెట్, నానాటికీ పెరుగుతున్న పోటీ, యువతలో మారుతున్న ఆలోచనా విధానాల నేపథ్యంలో—ఉద్యోగ వేటలో ఉన్న యువతరం తమ కెరీర్ మార్గాలను పూర్తిగా పునర్నిర్వచించుకోవాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. కేవలం సంప్రదాయ ఉద్యోగాల కోసమే పాకులాడకుండా, సమాజాన్ని శాసించే రాజకీయ రంగాన్ని ఒక పూర్తి స్థాయి ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకోవాలని నిపుణులు మరియు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో యువత హక్కుల కోసం, జవాబుదారీతనం కోసం రోడ్లెక్కి చేస్తున్న నిరసనలు, ఆందోళనలు వ్యవస్థను ప్రశ్నించడంలో వారికున్న అపారమైన శక్తిని నిరూపించాయి. అయితే, కేవలం నిరసనలకే ఆ ఎనర్జీ పరిమితం కాకూడదని, ఆ క్రోధాన్ని, ఆక్రోశాన్ని వ్యవస్థను మార్చే అధికారిక మార్గాలుగా మలచాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరం Gen Z.. రాజకీయాలను కేవలం అధికారాన్ని చలాయించే వేదికగా కాకుండా, సమాజ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతగా చూడాలి. ప్రస్తుతం రాజకీయ రంగం కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికే పరిమితం కాలేదు. దీని కింద ఎన్నో కార్పొరేట్ స్థాయి ప్రొఫెషనల్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఒకటి.. పాలసీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ప్రభుత్వాలు చేసే చట్టాలు, తెచ్చే పథకాల వెనుక ఉండే వ్యూహాలను, డేటాను విశ్లేషించే నిపుణులు. రెండు.. పొలిటికల్ కమ్యూనికేషన్. పార్టీల లేదా నాయకుల సిద్ధాంతాలను, సందేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే మీడియా, పీఆర్ వ్యూహకర్తలు. మూడు.. క్యాంపెయిన్ మేనేజ్మెంట్. ఎన్నికల వ్యూహాలు, బూత్ లెవెల్ ప్లానింగ్, డేటా ఆధారిత ప్రచారాలను కార్పొరేట్ స్థాయిలో నడిపించే మేనేజర్లు. నాలుగు.. గ్రాస్‌రూట్ లీడర్షిప్. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పని చేస్తూ, తద్వారా కొత్త నాయకత్వాన్ని నిర్మించడం.
కేవలం చట్టాలను, పాలకులను దూషిస్తూ కూర్చోవడం వల్ల వ్యవస్థ మారదు. యువత ఆ వ్యవస్థను అర్థం చేసుకోవాలి, అందులో భాగస్వాములు కావాలి, ఆపై దాన్ని లోపలి నుంచి మార్చడానికి ప్రయత్నించాలి. యువత ఐటి, మేనేజ్మెంట్ రంగాల్లో ఏ విధంగా అయితే తమ ముద్ర వేస్తున్నారో, అదే విధంగా దేశాన్ని నడిపించే పాలిటిక్స్‌ను కూడా ఒక కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.







