కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ రాహుల్ గాంధీ నాయకత్వంలో హస్తం పార్టీ పుంజుకుంటోంది. కానీ, తెలంగాణకు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. ఢిల్లీలో కనిపిస్తున్న ఆ జోష్, ఆ వ్యూహాత్మక దూకుడు గల్లీలో ఎందుకు కనిపించడం లేదు? అధికారం చేతిలో ఉన్నా.. రాబోయే ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ప్రభుత్వ నిర్ణయాలను బలంగా తీసుకెళ్లడంలో నాయకులు ఘోరంగా విఫలమవుతున్నారు. జాతీయ స్థాయిలో లభిస్తున్న మైలేజీని రాష్ట్రంలో సద్వినియోగం చేసుకోవడంలో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో వస్తున్న లోపాలను సరిదిద్దుకుని ప్రజలతో మమేకం కావాల్సిన తరుణంలో.. గ్రూపు రాజకీయాలు, అంతర్గత పూచికత్తులతోనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, క్షేత్రస్థాయి పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా, మీడియా సమావేశాల ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ మైలేజీని మొత్తం తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు డిఫెన్స్‌లో పడటమే కాకుండా, బీఆర్ఎస్ వేస్తున్న పొలిటికల్ గూగ్లీలను ఎదుర్కోవడంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు.
ఎన్నికల సమయానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని, క్యాడర్‌ను సమాయత్తం చేయాలి. కానీ, కాంగ్రెస్ అగ్ర నేతల్లో మాత్రం ఇంకా తామే అధికారంలో ఉన్నామనే “అతిధీమా” స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ వర్గాలు పార్టీకి దూరం అవుతున్నాయి? అనే కనీస అంచనాలు లేకుండా.. కంటితుడుపు చర్యలతో కాలం గడుపుతున్నారు. ఈ అతిధీమానే రాబోయే రోజుల్లో పార్టీని ముంచుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
జాతీయ నాయకత్వం ఒక దిశగా వెళ్తుంటే.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సొంత అజెండాలతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సరైన సమన్వయం లేదు. నియోజకవర్గాల్లో కార్యకర్తలను కాపాడుకోవడంలో, వారికి అండగా నిలబడటంలో స్థానిక నేతలు విఫలమవుతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ దూకుడుగా గ్రామాల్లోకి దూసుకెళ్తుంటే, కాంగ్రెస్ శ్రేణులు రక్షణ తత్వంతో కాలం వెళ్లదీస్తున్నాయి.
కేంద్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న తరుణంలో, తెలంగాణలో దాన్ని డబుల్ ఇంపాక్ట్‌గా మార్చాల్సిన బాధ్యత ఇక్కడి నాయకత్వంపై ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హస్తం నేతలు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ అండ్ టీమ్ వేస్తున్న స్పీడ్ బ్రేకర్ల ముందు కాంగ్రెస్ చేయి తడబడుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ “అతిధీమా” వీడి, అగ్రెసివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేయకపోతే.. చేతిలో ఉన్న అధికారం చేజారిపోవడానికి ఎంతో సమయం పట్టదు.







