Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

“యథా రాజా… తథా లోకల్ బాడీస్!

“యథా రాజా… తథా లోకల్ బాడీస్!
Follow Us :
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వారి చేతుల్లోకి వెళ్లడం ఒక అలిఖిత చట్టంగా మారిపోయింది. గత రెండు టర్మ్‌లుగా ముఖ్యమంత్రులు మారినా ఈ ‘రాజకీయ ఏకపక్ష పోకడ’ మాత్రం అస్సలు మారలేదు. రాత్రి పగలు కష్టపడే సామాన్య కార్యకర్తలకు, ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా.. ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగ వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి, ఏకగ్రీవాలతో, బెదిరింపులతో గెలిచేసి నేతలు తొడలు చరుస్తుండటం సిగ్గుచేటు. ఓటర్లను కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూస్తూ, గెలిచాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నాయకులను సామాన్య ప్రజలు ఇప్పటికైనా నిలదీయకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే సామాన్యుడికి అర్ధమయ్యే నగ్నసత్యం ఇదే! రాష్ట్ర గద్దెపై ఏ జెండా ఎగిరితే.. స్థానిక సంస్థల పీఠాలపై కూడా అదే జెండా బలవంతంగానో, వ్యవస్థలను వాడుకునో పాతేయడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. గత రెండు టర్మ్‌ల ముఖ్యమంత్రుల పాలనను చూస్తే ఈ విషయంలో ఇద్దరూ ఒకే బాటలో నడిచారని స్పష్టమవుతోంది. అధికారం చేతిలో ఉంటే చాలు, స్థానిక ఎన్నికలను కేవలం ఒక ‘ఫార్మాలిటీ’గా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని అంగడి సరుకుగా మారుస్తున్నారు.
నిజానికి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం, నాయకుల కోసం సొంత జేబులు గుల్ల చేసుకుని, కేసుల పాలవుతూ తిరిగే సామాన్య కార్యకర్తలకు మిగిలేది ఎప్పుడూ ‘మొండిచేయి’ మాత్రమే. కానీ, ఎన్నికలు రాగానే తెరవెనుక చక్రం తిప్పే నాయకులు.. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను, పవిత్రతను చిన్నభిన్నం చేస్తున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవడం, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం.. ఇదా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం?
ఇలాంటి అప్రజాస్వామిక విజయాలను మూటగట్టుకుని, తామేదో ప్రజల హృదయాలను గెలిచేశామని మైకుల ముందుకు వచ్చి తొడలు చరుస్తూ, మీసాలు తిప్పుతున్న నాయకులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు.. వ్యవస్థలను మేనేజ్ చేసి సాధించిన ‘సెలెక్షన్’ మాత్రమే!
ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలి. ఓటు వేసి గెలిపించినందుకు ఆ ప్రజలనే బానిసలుగా చూస్తున్న పాలకులను ప్రశ్నించే ధైర్యం రావాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ, వ్యవస్థలను అరిచేతిలో పెట్టుకుని నడుపుతున్న ఈ రాజకీయ దురంధరులను ఇప్పటికైనా వీధుల్లో నిలదీయకపోతే, రేపటి తరం ప్రజాస్వామ్యం అనే మాటకు అర్ధం వెతుక్కోవాల్సి వస్తుంది.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →