Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

అవినీతి రాజకీయాలకు ఏబీవీ సవాల్ విజయవాడలో ప్రకంపనలు

అవినీతి రాజకీయాలకు ఏబీవీ సవాల్ విజయవాడలో ప్రకంపనలు
Follow Us :

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాల మార్పు, విఫలమైన వ్యవస్థలను గాడిలో పెట్టడం కోసం సామాజిక మాధ్యమాలు, నిరసనలను వేదికగా చేసుకోవడం జెన్ జీ ఆశయం. రాజకీయ, పరిపాలన వ్యవస్థలను ప్రక్షాళన చేసి, పారదర్శకతతో కూడిన జవాబుదారీ పాలన అందించడం, సామాన్య ప్రజల దైనందిన సమస్యలను పరిష్కరించడం ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) లక్ష్యం. ఈ రెండు లక్ష్యాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వ్యవస్థల వైఫల్యాలపై పోరాటమే.

ఐపీఎస్ అధికారిగా తన సేవలను అందించి, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా పనిచేసిన అనుభవం, చట్టంపై పట్టు, ప్రజా సమస్యలపై అవగాహనతో ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత కొన్నేళ్లుగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, నిరాశ, నిస్సహాయతను గుర్తించి, మార్పు కోసం ఎదురుచూస్తున్న నగర ప్రజలకు పరిష్కార మార్గాలను చూపాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

ప్రజలకు చేరువవుతున్న ప్రచారం

సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఓటర్లతో నేరుగా మమేకమవుతున్నారు. మేధావులతో చర్చలు, సామాజిక కార్యకర్తలతో సమావేశాలు, వీధి స్థాయి ప్రచారం ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నెట్‌వర్క్ కూడా ప్రచారంలో భాగస్వామ్యమవుతోంది. నగరంలోని మౌలిక సమస్యలను ప్రస్తావిస్తూ వాటికి పరిష్కారాలను వివరించడం ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఉదయం ప్రారంభమయ్యే ప్రచారం రాత్రి వరకు కొనసాగుతోంది. ప్రచారం అనంతరం మిత్రపక్షాలు, ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతూ ఎన్నికల వ్యూహాలను సమన్వయం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తున్నారు.

అవినీతిపై పోరాటం ప్రధాన అజెండా

విశాఖపట్నం అభివృద్ధికి రూ.4,000 కోట్లు కేటాయించి, విజయవాడకు కేవలం రూ.140 కోట్లు కేటాయించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. బుడమేరు వరద నివారణకు కేటాయించినట్లు పేర్కొంటున్న రూ.600 కోట్ల వినియోగం, శాశ్వత వరద నివారణ ప్రణాళిక అమలు, స్థానిక సంస్థల నిధుల వినియోగంపై సమాధానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాలని, నిధుల దుర్వినియోగం జరిగితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

“ఓట్ల కోసం ఒక్క రూపాయి ఇవ్వను. నేను తీసుకోను. వేరే వారిని తీసుకోనివ్వను” అనే ప్రకటనతో ఓటర్లకు ప్రలోభాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇస్తున్నారు. అవినీతిని అరికట్టడం ద్వారా ప్రజాధనంలో 30 శాతం వరకు ఆదా చేయవచ్చని ఆయన పేర్కొంటున్నారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించే అవకాశం కల్పించడం, పాలనలో పారదర్శకతను పెంచడం ద్వారా అవినీతికి అవకాశాలను తగ్గించాలన్నది ఆయన ప్రతిపాదన.

వ్యాపారులకు, ఇంటి యజమానులకు భరోసా

చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలకు అనవసర వేధింపులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. రాబోయే మూడేళ్లపాటు ఆస్తి పన్ను పెంచబోమని, ఆ తర్వాత మార్పులు అవసరమైతే కార్పొరేటర్లు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ హామీలు వ్యాపారులు, ఇంటి యజమానుల సమస్యలపై చర్చకు దారితీస్తున్నాయి.

ప్రజల తక్షణ అవసరాలే ప్రధాన ఎజెండా

  • విజయవాడ నగర అభివృద్ధి కోసం ఏబీవీ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశాలు:
  • నగర ప్రజలకు 24 గంటల తాగునీటి సరఫరా.
  • డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి.
  • ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పార్కింగ్ సౌకర్యాల మెరుగుదల.
  • భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత.
  • బుడమేరు వరదలు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.
  • మున్సిపల్ రోడ్ల మరమ్మతులు, గుంతల సమస్యకు పరిష్కారం.
  • దోమల నివారణకు సమర్థవంతమైన చర్యలు.
  • సాగునీటి కాల్వల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు.
  • ప్రజా పార్కుల అభివృద్ధి, నిర్వహణ.

మార్పు దిశగా విజయవాడ అడుగులు

ప్రజల సమస్యలను గుర్తించడం, వాటికి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను ప్రతిపాదించడం, ప్రజాధన వినియోగంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడం ఏబీవీ ప్రచారంలో ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. జెన్ జీ కోరుకుంటున్న వ్యవస్థాగత మార్పులు, ఏబీవీ ముందుకు తెస్తున్న పరిపాలనా సంస్కరణల లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే.

ఎన్నికల హామీలు ఆచరణలో ఎంతవరకు అమలవుతాయన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే, అవినీతి నియంత్రణ, పారదర్శక పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న ఈ చర్చ విజయవాడ రాజకీయాల్లో ప్రజా సమస్యలకు ప్రాధాన్యం పెంచే ప్రయత్నంగా నిలుస్తోంది.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →