ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు తగిలిన ఊహించని షాక్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. “జెన్-జీ” నిరసనల పేరిట ఢిల్లీలో హల్చల్ సృష్టించి, జైలు పాలైన సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను న్యాయస్థానం నిలదీసింది. జంతర్ మంతర్ వద్ద నిషేధిత ఆజ్ఞలను ఉల్లంఘించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరు, తమ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ వీరికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ నిందితుల వయసుపై వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జెన్-జీ హక్కుల కోసం, యువత కోసం పోరాడుతున్నామంటూ భారీ బిల్డప్ ఇచ్చిన ఈ నేతల అసలు రంగును హైకోర్టు న్యాయమూర్తి ఒకే ఒక్క ప్రశ్నతో బయటపెట్టారు. న్యాయమూర్తి ప్రశ్న ఏంటంటే.. “అసలు మీ క్లయింట్ల వయసెంత?” అని. న్యాయవాది సమాధానం ఇస్తూ.. “సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు, ఆశుతోష్ రంకా వయసు 32 ఏళ్లు” అని చెప్పాడు. “అలాగైతే మీరు అస్సలు ‘జెన్-జీ’ కిందే రారు! అసలు జెన్-జీ అంటే ఎవరో తెలుసా? 1997 తర్వాత పుట్టినవాళ్లను జెన్-జీ అంటారు. మీరేమో ముప్పై ఏళ్లకు అటుఇటుగా ఉన్నారు. మీకూ జెన్-జీ ఉద్యమాలకు, ఈ అల్లర్లకు ఏంటి సంబంధం?” అని గట్టిగా నిలదీశారు.
న్యాయస్థానం వేసిన ఈ చాకిరేవు ప్రశ్నలకు సీజేపీ నేతల లాయర్లు నీళ్లు నమలాల్సి వచ్చింది. యువత పేరు చెప్పి పబ్బం గడుపుకునే ముఠాలకు ఢిల్లీ హైకోర్టు చెంపదెబ్బ కొట్టింది. దేశ రాజధానిలో శాంతిభద్రతలను పణంగా పెట్టి, యువతరం ఆవేశాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలని చూసిన సీజేపీ నేతల అసలు స్వరూపాన్ని న్యాయస్థానం నడిరోడ్డుపై నిలబెట్టింది. జంతర్ మంతర్ వద్ద బారికేడ్లు బద్దలు కొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, తామేదో విప్లవకారులమంటూ బిల్డప్ ఇచ్చిన వీరికి చట్టం తలదించేలా బుద్ధి చెప్పింది.
27, 32 ఏళ్ల వయసున్న వీరు.. 1997 తర్వాత పుట్టిన అమాయక జెన్-జీ యువతను ముందుంచి తెరవెనుక రాజకీయం నడుపుతున్నారనే పచ్చి నిజాన్ని కోర్టు రూమ్ సాక్షిగా జడ్జి బట్టబయలు చేశారు. “మీరు జెన్-జీ కాదు.. అలాంటప్పుడు ఈ నిరసనలతో మీకేంటి సంబంధం?” అంటూ న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలు, ఉద్యమాల పేరిట రెచ్చగొట్టే రాజకీయం చేసే ప్రతి ఒక్కరికీ గట్టి హెచ్చరిక.
హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుందామని పగటి కలలు గన్న ఈ నేతలకు న్యాయమూర్తి క్లాస్ పీకడంతో, వేరే దారి లేక తలదించుకుని తమ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. చట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘిస్తూ.. విదేశాల్లో జరుగుతున్న అల్లర్లు, లూటీల సంస్కృతిని ఇక్కడికి తీసుకురావాలని చూస్తే సహించేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. యువత పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేసే ఇలాంటి లీడర్ల ఆటలు ఇకపై సాగవని ఢిల్లీ హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది!







