మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్ల అపహరణ, స్క్రుటినీలో అక్రమాలు, పోలీసుల ఏకపక్ష వైఖరి అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందని, ఎన్నికల సంఘం నిద్రపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఒకప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పుడు ఇదే జగన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలేమిటో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. నాటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా ప్రతిపక్షాలను అడ్డుకోవడం, ఏకగ్రీవాల పేరిట సాగించిన అధికార దుర్వినియోగం, పోలీసు యంత్రాంగాన్ని సొంత అవసరాలకు వాడుకున్న తీరు చూస్తే.. నేడు జగన్ చెప్తున్న సుద్దులు కేవలం ‘అధికారం లేనప్పుడు వచ్చే జ్ఞానోదయం’ లాంటివనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో కొత్త తరహా అరాచకాలకు తానే ఆద్యుడిగా నిలిచి, ఇప్పుడు బాధితుడి పాత్ర పోషించడం రాజకీయ విడ్డూరం కాక మరేమిటి?
మరోవైపు, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాలపై గొంతెత్తిన చంద్రబాబు.. నేడు అధికారంలోకి వచ్చాక భిన్నంగానేమీ వ్యవహరించడం లేదు. వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తీసుకోవడం, అధికార బలంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం, ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేయడం వంటి ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వంపైనా వస్తున్నాయి. నాటి జగన్ పాలనను ‘జంగిల్ రాజ్’ అని విమర్శించిన చంద్రబాబు, నేడు అదే బాటలో పయనిస్తూ ‘దెందూ దొందే’ అనే నానుడిని నిజం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ పోలీసుల రంగు, ఎన్నికల సంఘం తీరు మారిపోవడం ఒక ఆనవాయితీగా మారింది. జగన్ హయాంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు ఉంటే, నేటి చంద్రబాబు ప్రభుత్వంలోనూ శాంతిభద్రతల నిర్వహణ, ఎన్నికల పర్యవేక్షణ అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా, అధికారంలో ఎవరుంటే వారికి తలొగ్గడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.







